న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్షాల మధ్య కొన్నాళ్లుగా వాడివేడిగా నలుగుతున్న రాఫెల్ ఒప్పందం బంతి ఇప్పుడు సుప్రీం కోర్టులో పడింది. 36 రాఫెల్ జెట్ విమానాల కొనుగోలుకు ఎంత ఖర్చయిందనే వివరాలను తెలియజేయాలని కోరుతూ వినీత్ థండా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కెఎం జోసఫ్ ఈ పిటిషన్ ను బుధవారం విచారణకు స్వీకరించారు.
10న విచారణ…
ఈ నెల 10న అంటే బుధవారం నాడు ఈ పిటిషన్ విచారణ ప్రారంభిస్తామని జస్టిస్ గొగొయ్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. రాఫేల్ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్ కంపెనీని భాగస్వామిగా చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వమే సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలండ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయదుమారాన్ని సృష్టించిన విషయం విధితమే. వివాదం ముదిరిపోవడంతో వెంటనే ఆయన మాట మార్చేశారు. ఇందులో భారత ప్రభుత్వం ప్రమేయం లేదని చల్లగా చెప్పుకొచ్చారు.
దీంతో వివాదం చల్లారకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ గళం ఎత్తారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. యుద్ధ విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యం అనుభవం లేని రిలయన్స్ కంపెనీని ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు.