

పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది . శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఆధారాలు మాయం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది.
తటస్థ ప్రదేశమైన మేఘాలయలోని షిల్లాంగ్‌లో సీపీ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. ఈ కేసు విచారణలో సీబీఐకి సీపీ పూర్తిగా సహకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి అరెస్టు సహా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగరాదని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు.
సీబీఐకి సీపీ పూర్తిగా సహకరించండి..
సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కారం పిటిషన్‌పై సమాధానం చెప్పాలంటూ కోల్‌కతా సీపీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, డీజీపీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీపీ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను ఆయన నివాసం వద్ద కోల్‌కతా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం రేగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమపై సీబీఐని ఉసిగొల్పుతూ ప్రతీకార చర్యలకు దిగుతోందంటూ సీఎం మమత ధర్నాకు దిగారు.








