24.2 C
Hyderabad
Sunday, November 29, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రాహుల్! మీ సర్టిఫికేట్ అవసరం లేదు, మీ అసహనం అందుకే..: నితిన్ ఘాటు కౌంటర్

రాహుల్! మీ సర్టిఫికేట్ అవసరం లేదు, మీ అసహనం అందుకే..: నితిన్ ఘాటు కౌంటర్

- Advertisement -

nitin gadkari

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. తనలోని ధైర్యం గురించి రాహుల్‌ గాంధీ నుంచి తనకు ఎటువంటి సర్టిఫికెట్‌ అవసరం లేదని గడ్కరీ తేల్చి చెప్పారు. బీజేపీలో ధైర్యం ఉన్న నేత గడ్కరీ ఒక్కరేనని రాహుల్‌ సోమవారం ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గడ్కరీ స్పందిస్తూ… ‘రాహుల్‌ జీ.. నా ధైర్యం గురించి, మీ నుంచి నాకు సర్టిఫికెట్‌ అవసరం లేదు.. కానీ, నేను ఓ విషయంపై ఆశ్చర్యపోయాను. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న మీరు ప్రభుత్వంపై దాడి చేయడానికి మీడియా ప్రచురించిన తప్పుడు సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఇలా ఇతరులపై ఆధారపడి విమర్శలు చేస్తుంటే ప్రధాని మోడీతో పాటు మా ప్రభుత్వానికి ఉన్న బలం ఎంతో తెలుస్తోంది’ అని ట్విట్టర్ వేదికగా హితవు పలికారు.

‘గడ్కరీ జీ.. బీజేపీలో ధైర్యం ఉన్న నేత మీరు ఒక్కరే. దయచేసి ఈ అంశాలపై మీరే మాట్లాడాలి.. రఫేల్‌ కుంభకోణం, అనిల్‌ అంబానీ, రైతుల సమస్యలు, నిర్వీర్యమవుతున్న వ్యవస్థలు.., నిరుద్యోగం’ అని రాహుల్‌ చేసిన ట్వీట్లపైనా గడ్కరీ ఘాటుగానే స్పందించారు.

రాహుల్ మీ అసహనం అందుకేగా: నితిన్

‘మీరు నా ముందు ఉంచిన అంశాలపై సమాధానం చెబుతున్నాను. దేశ ప్రయోజనాల దృష్ట్యానే మోడీ ప్రభుత్వం రఫేల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మీ కాంగ్రెస్‌ విధానాలతో తలెత్తిన రైతుల సమస్యలను నిజాయతీ గల మోడీజీ విధానాలు పరిష్కరిస్తున్నాయి. మోడీ ప్రధాని కావడాన్ని మీరు భరించలేకపోతున్నారు. అందుకే, దేశంలో అసహనం ఉందని, రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని మీరు కలలు కంటున్నారు. మోడీ మళ్లీ ప్రధాని అవుతారు. రాహుల్‌ గాంధీ భవిష్యత్తులోనైనా హేతుబద్ధతతో, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను’ అని గడ్కరీ వరుస ట్వీట్లతో రాహుల్ గాంధీకి హితవు పలికారు. కాగా, రాహుల్, నితిన్ ట్వీట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

చదవండి: ఆ పార్టీలో గడ్కరీ ఒక్కడే దమ్మున్నోడు: రాహుల్ సెటైర్లు

- Advertisement -