శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ప్రకటించింది. ఆలయంలోకి స్గ్రీల ప్రవేశాన్ని నిషేధించడన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. శబరిమల ఆలయంలోకి స్త్రీలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
10-50 సంవత్సరాల మధ్య వయసుగల స్త్రీలు ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్‌తో పాటు మరి కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ఆగస్టు 1 నుండి 8 తేదీ వరకు రెండు వర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
పురుషులకు వర్తించే హక్కులు మహిళలకు కూడా…
శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేయడం మహిళలకు భారత రాజ్యాంగ ఇచ్చిన హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్ష చేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా నిషేధించడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యంగంలోని ఆర్టికల్స్ 25, 26 ప్రకారం పురుషులకు వర్తించే హక్కులు మహిళలకు కూడా వర్తిస్తాయని, మతం విషయంలో స్త్రీలకు సమాన హక్కు ఉండల్సిందే స్పష్టం చేసింది, స్త్రీలపై వివక్ష చూపడం సరికాదని, రుతుస్రావన్ని సాకుగా చూపడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది.
రుతుస్రావం కారణంగా పేర్కొంటూ 10-50 సంవత్సరాల మధ్య వయసుగల బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. అయితే ఈ చర్య లింగ సమానత్వానికి విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మరి కొందరు కూడా ఇదే విషయమై సుప్రీంలో పిటిషన్లు వేశారు. అయ్యప్పస్వామి ‘బ్రహ్మచారి’ అని, అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ.. రుతుస్రావం వచ్చే అమ్మాయిలను, స్త్రీలను ఆలయంలోకి అనుమతించడం లేదని దేవస్థానం వారు గతంలో స్పష్టం చేశారు.
తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం: దేవస్థానం
మరోవైపు శబరిమల ఆలయంలోకి స్త్రీల ప్రవేశాన్ని అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం తెలిపింది. మత పెద్దలతో చర్చించి వారి మద్దతుతో త్వరిలోనే ఈ పిటిషన్ వేస్తామని పేర్కొంది.