న్యూఢిల్లీ : వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఐ.పీ.సీ సెక్షన్ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం గురువారం సంచలనమైన చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సుస్పష్టం చేసింది. స్త్రీలను తోటి మనుషులుగా కాకుండా వస్తువులుగా చూస్తున్నరని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వైవాహిక జీవితంలోని అసంతృప్తికి వివాహేతర సంబంధాలు ప్రధాన కారణం కాదని, వైవాహిక జీవితంలోని అసంతృప్తి వల్లే ఇలాంటి ఆక్రమ సంబంధాలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.
స్త్రీల సమాన అవకాశాలను సెక్షన్ 497 కాలరాస్తోందని, సమానత్వ హక్కులను తూట్లు పొడిచేలా ఇది ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. స్త్రీలను సమానులుగా చూడని ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమేనని,
వివాహేతర సంబంధాల్లో పురుషులను మాత్రమే బాధ్యులను చేసే సెక్షన్ 497 సరికాదని, స్త్రీలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది.
పరస్పర సమ్మతితో చేస్తే నేరం కాదు…
ఇద్దరి పరస్పర సమ్మతితో చేసే శృంగారం ఇకపై నేరం కాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 497 ఒక పురాతన చట్టమని, సెక్షన్ 497 ఏకపక్షంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇష్టపూర్వకంగా శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 497తోపాటు ఐపీసీ సెక్షన్ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని పేర్కొంది.
సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
వివాహేతర సంబంధాల విషయంలో వివాహం అయిన స్త్రీలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులు ఇద్దరు చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్ వాదిస్తున్నారు.
ఛీప్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనంలో డీవై చంద్రచూడ్, ఏఎం ఖన్విల్కర్, ఆర్‌ఎఫ్ నారీమన్,,ఇందూ మల్హోత్రా తదితర న్యాయమూర్తులు ఉన్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.
ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా ఇంకా తీవ్రమైనదిగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ ఈ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే.. వివాహం రద్దుకు దారి తీసే విధంగా సెక్షన్ 497 ఉందని ఆయన అన్నారు.
సెక్షన్ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, మరియు జరిమానా లేక ఈ రెండూ కూడా ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఈ సెక్షన్ ఆమె అసలు నేరస్తురాలే కాబోదు.