న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తనను పరారీలో ఉన్న ఎగవేతదారుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి నోటీసులు జారీ చేసింది.
బ్యాంకు రుణాలను చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై విచారణను నిలిపివేయాలని విజయ్ మాల్యా ఈ సంవత్సరం నవంబర్ 22న సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నేను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని కాదు…
మరోవైపు తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని కాదని సెప్టెంబర్‌లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్ట (పీఎంఎల్‌ఏ) న్యాయస్ధానానికి నివేదించారు. తను మనీల్యాండరింగ్‌కు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. రూ 9000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు మాల్యాపై అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
న్యాయస్ధానాలు ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించడంతో ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యాను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు వేగవంతం చేసింది.
మాల్యా అప్పగింతపై వచ్చేవారం బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. తాను బ్యాంకు రుణాల అసలు మొత్తం చెల్లించేందుకు సిద్ధగా ఉన్నానని, తన ప్రతిపాదనను బ్యాంకులు అంగీకరించాలని రెండు రోజుల కిందట మాల్యా ప్రతిపాదించారు.