హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు బనాయించి అరెస్టు చేయించడం తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
చదవండి: లగడపాటి నోట మళ్లీ అదే మాట: కారు జోరుకు బ్రేక్.. ప్రజా కూటమిదే గెలుపు, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం
గతంలో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డిని అరెస్ట్ చేయించడం, అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడం, కోస్గిలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను సజావుగా నిర్వహించడం కోసం.. పోలీసుల చేత ముందస్తుగా రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి జరిపించి తెల్లవారుజామున అరెస్టు చేయించడం వంటి చర్యలు.. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి కొంతవరకు నష్టం కలిగించే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన కోస్గిలో కేసీఆర్ సభ సందర్భంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కూడా పోలీసుల తీరును తప్పుబట్టింది.
ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం…
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు తగ్గడానికి ప్రభుత్వ వ్యతిరేకత కారణమని లగడపాటి రాజగోపాల్ విశ్లేషించారు. ఈ వ్యతిరేకత కారణంగానే ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందబోతున్నారని అన్నారు. ఆయా స్థానాల్లో ప్రజలు స్వతంత్ర అభ్యర్థుల వైపు మొగ్గుచూపారని పేర్కొన్నారు. అలాగే గతంలో బీజేపీ.. టీడీపీతో కలిసి పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందిందని, ఈసారి మాత్రం సొంతగానే బరిలోకి దిగిందని చెప్పారు.
బీజేపీకి కూడా ఈ ఎన్నికల్లో గతంలో లభించిన సీట్ల కంటే ఎక్కువే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీనికి కారణం కూడా ప్రభుత్వ వ్యతిరేకతే అని లగడపాటి చెప్పారు. నిజానికి ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ అతి చిన్న పార్టీ అని, అయినా ఆ పార్టీకి ఇన్ని స్థానాలు దక్కడం, అలాగే ప్రజాకూటమికి పడని ఓట్లు బీజేపీకి పడడం కూడా టీఆర్ఎస్ అంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే కారణమని ఆయన విశ్లేషించారు.