రాంచీ: కన్న తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు ఎలాగైనా ఆయన్ని తిరిగి బతికించాలనుకున్నాడు. క్షుద్రపూజలు చేస్తే బతుకుతాడనే నమ్మకంతో.. తండ్రి శవం కుళ్లిపోకుండా భద్రపరిచి.. పూజలు చేయడం ప్రారంభించాడు. ఇలా ఒకరోజు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా ఆరు నెలల పాటు క్షద్ర పూజలు కొనసాగించాడు. జార్ఖండ్‌లోని మకత్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… జార్ఖండ్ మకత్‌పూర్‌లోని ఇందిరాకాలనీలో ఉంటున్న విశ్వనాథ్ ప్రసాద్(75) అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇష్టపడలేదు. ఎలాగైనా తండ్రిని తిరిగి బతికిస్తానని నమ్మబలికాడు.
తండ్రి మృతదేహం కుళ్లిపోకుండా…
కుటుంబ సభ్యులను ఒప్పించి తండ్రి మృతదేహం కుళ్లిపోకుండా ప్రత్యేక రసాయనాలు పూసి ఐస్‌లో భద్రపరిచాడు. ఆ తరువాత క్షుద్రపూజలు మొదలుపెట్టాడు. నిత్యం విశ్వనాథ్ ప్రసాద్ శవం ముందు కూర్చుని పూజలు చేస్తూనే ఉండేవాడు. ఆరు నెలలు గడిచిపోవడం, విశ్వనాథ్ ప్రసాద్ బతకకపోవడంతో ఇప్పటికైనా తండ్రి శవానికి అంత్యక్రియలు నిర్వహించాలంటూ తల్లి, చెల్లి ప్రశాంత్ కుమార్‌కు సూచించారు.
ఆగ్రహం చెందిన ప్రశాంత్ కుమార్ తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డాడు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ప్రశాంత్ కుమార్ గురించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రశాంత్ కుమార్ ఇంటిపై దాడి చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు ప్రశాంత్ కుమార్‌ను అదుపులోనికి తీసుకుని, విశ్వనాథ్ ప్రసాద్ మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. అనంతరం ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు ప్రశాంత్ కుమార్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారు.