ఖమ్మం: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మగా మారారని, బీజేపీ కబంద హస్తాల్లోకి వెళ్లిపోయారని తిరుగుబాటు నేత, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో సీనియర్ నేతలకు గౌరవం లేదని, రెండేళ్లుగా తనకు కేటీఆర్ అపాయింట్‌మెంట్ దొరకలేదంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నానని, టీఆర్ఎస్ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదని బుడాన్ బేగ్ తెలిపారు.
కేసీఆర్.. బీజేపీకి లొంగిపోయారు…
ఫెడరల్ ఫ్రంట్ పెట్టి బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కొంటామని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని… ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో తెలంగాణ సాధించి తెచ్చుకున్నప్పటికీ ఇప్పుడు టీఆర్ఎస్‌లో అవే కొరవడ్డాయంటూ బుడాన్ బేగ్ దుయ్యబట్టారు.
ప్రధాని మోడీకి కేసీఆర్ లొంగిపోయారని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వబోమని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ గడ్డపైకి వచ్చి ప్రకటించినా.. కనీసం ఆయన్ని విమర్శించే ధైర్యం కూడా కేసీఆర్ చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ నుంచి తాను బయటికి వెళతాననే వార్తలు వచ్చిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని బుడాన్ చెప్పారు. మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో ఖమ్మంలో ఈ నెల 28న జరిగే సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలో బుడాన్ బేగ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.