మహాకూటమిలో సీట్ల కోసం కుమ్ములాటలు ముగిశాయి. అసంతృప్తవాదులను బుజ్జగించారు. కొన్ని చోట్ల మహాకూటమి అభ్యర్థులకు మద్దతిచ్చేందుకు వారు అంగీకరించినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చక్రం తిప్పడాన్ని ఒక వర్గం అంగీకరించడం లేదు. కోదండరామ్ లాంటి వారు.. ఇచ్చిన 8 సీట్లలో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అక్కడ అసంతృప్తులు ఉన్నాయి. ఇకపోతే కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎంత ఉందో వారికి తెలీదు. అందరూ చెల్లాచెదురైపోయారు. కొందరు వృద్ధులైపోయారు. ఇలాంటి పార్టీల సయోధ్యతో ..అసలే కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఎక్కువ. వాటికితోడు మహాకూటమి తలనొప్పుల మధ్య ప్రస్తుతం ఎదురీదుతోంది. ఇవన్నీ చూసి.. తెలంగాణ ప్రజల దృష్టిలో నెమ్మదిగా మహాకూటమి పట్ల విముఖత ఏర్పడుతోంది. రెండవది ఇంకా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు అధికారికంగా ఆలస్యంగా ప్రకటించడంతో..వారు ప్రచారంలో వెనుకపడిపోయారు. అప్పుడే టీఆర్ ఎస్ అభ్యర్థులు.. నియోజకవర్గాలను ఒక రౌండ్ తిరిగేశారు. నాలుగుపార్టీల మహాకూటమి.. కార్యకర్తలు..మాకు ఆధిక్యత ఇవ్వడం లేదంటూ.. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. వీరందరూ ఇలాగే ఉండి.. బూత్ కమిటీలను సమయానికి ఏర్పాటు చేసుకోకపోతే.. పోలింగ్ రోజున చుక్కలు కనిపించే అవకాశాలున్నాయి.
ఇప్పుడు మహాకూటమిలో మిత్ర పక్షాలకిస్తున్న 25 సీట్లలో.. ఏమైనా సమీకరణాలు మారి.. ఒకవేళ వారు అక్కడ జెండా తిప్పితే, .. అప్పుడా సీట్లు.. బీజేపీ లేదా టీఆర్ఎస్ కి చేరితే..కూటమి వ్యూహాలు తలకిందులవడం ఖాయం. టీఆర్ఎస్ ఈ పరిస్థితుల్లో 50 సీట్లు గెలుచుకోగలిగితే.. ఈ అసంతృప్తుల జాడ్యం వల్ల అక్కడ 10 సీట్లు ఇటొచ్చి పడితే 60 అవుతాయి. ఎంఐఎం మద్దతు ఉంటుంది. ఇలా టీఆర్ ఎస్ అధికారం తిరిగి చేజిక్కించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ప్రస్తుతం కేసీఆర్ కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పటికీ కొంచెం కారు స్టీరింగ్ ఆయన కంట్రోల్ లోకి వచ్చిందనే చెప్పాలి. అయితే వచ్చే కొద్ది రోజులలో ఫలితం తేలే వరకు అందరికి టెన్షనుగానే ఉంటుంది. నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తిపోతోంది. గతంలోలా బయట పోస్టర్లు, పత్రికల్లో ప్రకటనలు కనిపించడం లేదు. అంతా సోషల్ మీడియా మహత్యంలా ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ..సొంతంగా ఒక వాట్సాప్ గ్రూప్ లు పెట్టుకొని డైరెక్టుగా వారే ప్రజలకు వారేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేస్తున్నారు. ఇప్పుడు రిపోర్టర్లకి కూడా పెద్ద పని లేదు. ఎందుకంటే పత్రికల యాజమాన్యాలన్నీ ఏదొక పార్టీకి కొమ్ము కాస్తుండటంతో వారు..తమకి నిజం తెలిసినా రాయలేరు..నోరు తెరిచి చెప్పలేని పరిస్థితులున్నాయి. అంతా దైవం మీద భారం వేసి.. రిజల్ట్ రోజున చూసుకుందామని చెప్పి..గమ్మున కూర్చున్నారు. నాయకుల మటుకు నాయకులు ఎవరి ధోరణిలొో వారు వెళ్లిపోతున్నారు.
ఇక ఓటరు చేతిలోనే భారం పెడుతున్నారు. అతను ఎవరిని దయతలుస్తాడో.. ఎవరిని ఐదేళ్లు పీఠం ఎక్కిస్తారో వేచి చూడాల్సిందే..