28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కాంగ్రెస్ పగ్గాలు మళ్లీ సోనియాకే! పూర్తిస్థాయి అధ్యక్షుడు వచ్చే వరకూ ఆమే చీఫ్…

కాంగ్రెస్ పగ్గాలు మళ్లీ సోనియాకే! పూర్తిస్థాయి అధ్యక్షుడు వచ్చే వరకూ ఆమే చీఫ్…

sonia-gandhi-as-congress-interim-president
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తాత్కాలికంగా సోనియాగాంధీకే అప్పగించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా అనంతరం ఎవరెన్ని చెప్పినా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో శనివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీకి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేంత వరకు పార్టీ బాధ్యతలను సోనియాపైనే పెట్టింది. 

పార్టీ పగ్గాలు తిరిగి రాహుల్ గాంధీకి అప్పగించేందుకు సీడబ్ల్యూసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 72 ఏళ్ల సోనియాగాంధీ వైపే మొగ్గు చూపింది. ఆమెను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్లు సీడబ్ల్యూసీ భేటీ ముగిశాక ఆ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, హరీశ్ రావత్ వెల్లడించారు.

20 మాసాల తర్వాత…

అంతకుముందు పార్టీ కొత్త అథ్యక్షుడి ఎంపిక విషయమై పార్టీ నేతలతో సీడబ్ల్యూసీ సుధీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 20 మాసాల తర్వాత సోనియాగాంధీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.  ఎఐసీసీ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే వరకు కూడ సోనియాగాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇకనైనా తమ కుటుంబానికి చెందిన వారిని కాకుండా.. ఇతరులను పార్టీ అద్యక్షులుగా ఎన్నుకోవాలని రాహుల్ గాంధీ చేసిన సూచనను సీడబ్ల్యూసీ ప్రస్తుతం పక్కన పెట్టింది.

ప్రియాంక గాంధీని కోరినా…

రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేలా ఒప్పించాలని ప్రియాంక గాంధీని కూడ కొందరు నేతలు కోరారు. ఆ ప్రయత్నాలు కూడ సఫలం కాలేదు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకుంది. 

కాంగ్రెస్ క్లిష్టకాలంలో ఉన్నప్పుడు 1998లో సోనియా తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యాక జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది.

దీంతో 1999-2004 సంవత్సరాల మధ్య కాలంలో లోక్‌సభలో సోనియా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 

- Advertisement -