బీ కేర్‌ఫుల్! భారత్‌లో భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర

12:59 pm, Sun, 11 August 19

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదుల దృష్టి ఇటువైపు మళ్లింది. ఇప్పటికే భారత్‌లో విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారు. స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇలాంటి హెచ్చరికే చేశారు.

పుల్వామా వంటి దాడులు పునరావృతమవుతాయని హెచ్చరించారు. తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెడీ అయ్యారు. భారత్‌లో భారీ విధ్వంసానికి ఐసిస్ పథకం పన్నినట్టు భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం రాజ్యం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటయిన ఐసిస్‌ మద్దతుతో జైషే మహ్మద్, లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది.

దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను లక్ష్యంగా చేసుకుని బక్రీద్‌, లేదంటే పంద్రాగస్టున పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. నిఘావర్గాల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

ఈ నెల 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న పాక్ కశ్మీరీలకు సంఘీభావంగా ప్రకటించాలని నిర్ణయించింది. అలాగే భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’ నిర్వహించాలని కూడా పాక్ నిర్ణయించినట్టు సమాచారం.