

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగింపునకు గురైన అలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైర్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన అలోక్ వర్మ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం.. ఆయనను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు.. అలోక్ వర్మ బదిలీ చేసిన అధికారుల బదిలీలను రద్దు చేయడం కూడా వర్మ రాజీనామాకు కారణంగా తెలుస్తోంది. అలోక్ వర్మ జనవరి 31న పదవీ విరమణ చేయవలసి ఉంది.
నాపై తప్పుడు ఆరోపణలు: అలోక్ వర్మ
తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసి పదవి నుంచి తొలగించారని సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా కేవలం ఒక్క వ్యక్తి చేసిన ఆరోపణలతో తనను బదిలీ చేశారని వాపోయారు.
అవినీతి కేసులపై దర్యాప్తు జరిపే సీబీఐ స్వతంత్రతను తప్పనిసరిగా కాపాడాలని అలోక్ వర్మ కోరారు. నిరాధారమైన ఆరోపణలతో తనను కమిటీ బదిలీ చేయడం చాలా విచారకరమని అన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటైన కమిటీ.. అవినీతి, విధుల పట్ల అలసత్వం వంటి ఆరోపణలు ఉన్నట్లు కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆయనను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఆలోక్ వర్మను అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్ విభాగం డీజీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోక్ వర్మకు తిరిగి సీబీఐ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కేవలం రెండు రోజుల్లోనే ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి ఆ స్థానంలో మళ్లీ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించారు.
సంబంధిత వార్తలు
షాకింగ్: అలోక్ వర్మకు హైపవర్ కమిటీ ఝలక్, సీబీఐ డైరెక్టర్‌గా తొలగింపు, బదిలీ ఎక్కడికంటే…








