

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ మురిపెం మళ్లీ ఒక్కరోజుకే పరిమితమైంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో బుధవారం తిరిగి సీబీఐ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు గురువారం సమావేశమైన హైపవర్ కమిటీ మళ్లీ గట్టి షాక్ ఇచ్చింది.
సీవీసీ నివేదికలో వచ్చిన ఆరోపణలవైపే మొగ్గుచూపుతూ అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవినుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే…
నిజానికి ఈ జనవరి 31తో అలోక్ కుమార్ వర్మ పదవీకాలం పూర్తవుతుంది. అయితే అప్పటి వరకు కూడా హైపవర్ కమిటీ ఆగలేదు. అలోక్ తిరిగి బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది.
గురువారం సాయంత్రం భేటీ అయిన హై పవర్ కమిటీ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా చర్చించింది. ఆనంతరం ఆయనపై సీవీసీ చేసిన ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తూ అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసెస్ అండ్ హోంగార్డు విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మల్లికార్జున ఖర్గే అభ్యంతరం, అయినా…
అయితే హైపవర్ కమిటీలో ఒక సభ్యుడైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలోక్ వర్మపై చర్యలు తీసుకునేముందు సీవీసీ ఆరోపణలపై ఆయన నుంచి వివరణ తీసుకోవాలని ప్రతిపాదించారు.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకే ప్రధాని మొగ్గుచూపారు. హైపవర్ కమిటీలో మరో సభ్యుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తరుపున సమావేశానికి హాజరైన జస్టిస్ సిక్రీ కూడా ప్రధాని నిర్ణయంతో ఏకీభవించడంతో మల్లికార్జున ఖర్గే ఒంటరి అయిపోయారు.
ముగ్గురు సభ్యులు కలిగిన హైపవర్ కమిటీ 2-1 ఓట్ల తేడాతో అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ చీఫ్‌గా అలోక్ వర్మను పదవి నుంచి తప్పించినప్పటికీ.. ఆయనపై వచ్చిన ఆరోపణలపై మాత్రం దర్యాప్తు మాత్రం జరపాల్సిందేనని జస్టిస్ సిక్రీ అభిప్రాయపడ్డారు.








