

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఇతర పార్టీ నేతల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నకారు రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆదాయం సమకూర్చేందుకు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను రాహుల్ ఎద్దేవా చేశారు.
రోజుకు రూ.17 ఇవ్వజూపుతూ రైతులను అవమానిస్తున్నారని ప్రధాని మోడీపై రాహుల్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘డియర్ నమో, ఐదేళ్ళ మీ అసమర్థత, అహంకారం మా రైతుల జీవితాలను నాశనం చేశాయి. వాళ్ళకి రోజుకి రూ.17 ఇవ్వడం వాళ్ళు చేసే పనికి, నిలిచిన లక్ష్యానికి అవమానకరం. ఇది చివరి మాటల గారడీ బడ్జెట్’ అని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాపీ కొట్టారు, మోసం: బడ్జెట్‌పై మమతా బెనర్జీ
కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రజలను మోసగించేలా ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తమ పథకాలనే కాపీ కొట్టిందని, పశ్చిమబెంగాల్లో తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కొత్తగా ప్రకటించిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర పథకం అని చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’, పశ్చిమ బెంగాల్లో ముందు నుంచే అమల్లో ఉందని, ఆరోగ్య పథకం కింద రూ.5 లక్షల వరకు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇస్తామన్న రైతు సాయం తమకు వద్దని, అరకొర సాయం తమకు అవసరంలేదని మమత తేల్చిచెప్పారు.
ఇది ఎన్నికల బడ్జెట్టే: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఈ బడ్జెట్ ప్రభావం చూపుతుందని మండిపడ్డారు. ఎన్నికల తాయిలాలు ఇస్తున్నట్టుగా బడ్జెట్ ఉందని.. ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెట్టే అని అన్నారు. రైతులకు, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
అకౌంట్ ఫర్ ఓట్స్: చిదంబరం
కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కుగా వర్ణించారు. అంతేగాక, ఇది ‘ఓటాన్ అకౌంట్ కాదు అకౌంట్ ఫర్ ఓట్స్’ అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు.








