26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభీ బాకీ హై..: బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ

ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభీ బాకీ హై..: బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతులు, మధ్యతరగతి వేతన జీవులు సహా అందరి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ బడ్జెట్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశాన్ని అభివృద్ధి బాటలో పరుగులెత్తిస్తామని అన్నారు.

చదవండి: కేంద్ర బడ్జెట్ 2019: మధ్య తరగతి, రైతులపై వరాల వర్షం, పార్లమెంటులో పీయూష్ గోయల్ ప్రసంగం

పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. బడ్జెట్‌లో పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపామన్నారు. ఇది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో సంతృప్తి ఉందని అన్నారు.

పేదరికం గణనీయంగా తగ్గింది…

ప్రభుత్వ పథకాల అమలు నేపథ్యంలో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా 1.5 కోట్ల మంది శాశ్వత గృహాలు నిర్మించుకున్నారన్నారు.

ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుకున్నారని ప్రధాని తెలిపారు. ప్రజల కోరికను ఈనాటికి ప్రభుత్వం నెరవేర్చగలిగిందని చెప్పారు. మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, అసంఘటిత కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ సంతృప్తిని ఇస్తుందని చెప్పారు.

రైతుల కోసం ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయని, కానీ ఆ పథకాలు కేవలం రెండు లేదా మూడు కోట్ల మందికి లబ్ధి చేకూర్చేవని, కానీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి ద్వారా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఐదు ఎకరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్న వారికి నేరుగా వారి అకౌంట్‌లో లబ్ధి మొత్తం వేస్తామని చెప్పారు.

కాగా, ఎన్నికల సమీపిస్తున్న వేళ మధ్యంతర బడ్జెట్‌ ఓటర్లను ఆకట్టుకునేలా సాగింది. పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులు, వేతన జీవులకు ఊరట ఇచ్చే చర్యలు చేపట్టారు.

- Advertisement -