

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా శుక్రవారం జరిగిన అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్రానికి చెప్పిన దానికంటే ఎక్కువే చేశామంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెబుతుండగానే.. ఆగ్రహంతో ఊగిపోతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.
కేంద్రం రాష్ట్రానికి ఏం సాయం చేసిందంటూ నిలదీశారు. రాష్ట్రం నష్టపోతే ఆవేదన ఉండదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం తరపున మాట్లాడటానికి మీకు సిగ్గుండాలని, మీకు ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత కూడా లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. తెలుగువాళ్లకు పౌరుషం లేదనుకున్నారా? అంటూ విష్ణుకుమార్ రాజు, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్ని నిధులిచ్చారో.. వాటిని ఒకసారి ఏపీతో పోల్చి చూడాలని సీఎం అన్నారు.
‘ఎవరికోసం నిధులిస్తారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఎవరబ్బ సొమ్ము అనుకుంటున్నారు. వినేవాళ్లు ఉంటే మీ ఇష్టప్రకారం మాట్లాడతారు. సాధారణ పౌరుడుకి ఉండే ఆసక్తి.. ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత మీకు లేదు. రక్తం పొంగిపోతోంది. రాష్ట్రంలో ఎవరికి ఊడిగం చేస్తారు? అడిగేవారు లేరనుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేస్తారు? జైల్లో పెడతారా? మీ ఇష్ట ప్రకారం తమాషాలు ఆడుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే సహకరించాల్సిందిపోయి సిగ్గు వదిలిపెట్టి మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టం. బీజేపీ నేతలను తిరగనివ్వం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు చంద్రబాబు.
కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి చేశారని.. అది ఆయనకు ప్రమోషనా లేక పనిష్మెంటా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘అశాస్త్రీయ విభజన జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఇంటింటికీ తిరిగాను. ప్రధాని మోడీ ఎక్కడికొస్తే అక్కడ కలిశాను. న్యాయం చేస్తారనే తిరిగాను. నాకోసం తిరగలేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరుతున్నా’ అని చంద్రబాబు అన్నారు. కాగా, విభజన హామీలు నెరవేర్చలేదంటూ కేంద్ర వైఖరికి నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు వేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
చంద్రబాబు మనిషిగా ఉండే అర్హతే కోల్పోయారు: కన్నా తీవ్ర విమర్శలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి చూస్తుంటే ప్రజల రక్తం ఉడికిపోతోందని, మనిషిగా ఉండే అర్హతను ఆయన ఎప్పుడో కోల్పోయారని అన్నారు. బీజేపీ నేతలపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన శుక్రవారం ట్విట్టర్లో స్పందించారు.
‘మీకు సిగ్గుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను మీవిగా దొంగ ప్రచారం చేసుకోరు. రాష్ట్ర కోసం మీరేదో హెరిటేజ్ డబ్బులు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు భాషను సరిచేసుకోని క్షమాపణలు చెప్పాలి. మనిషిగా ఉండే అర్హతను మీరు ఎప్పుడో కోల్పోయారు. నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, కేంద్ర ఇచ్చిన లక్షల కోట్ల నిధులను దోచేసి ఇప్పుడు మమ్మల్నే తిడతావా?. రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తినేస్తు.. లెక్కలు అడిగితే యూటర్న్ తీసుకుని మాపై నిందలు వేస్తావా’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ఏకిపారేశారు.
చంద్రబాబు ఎందుకు ఉలక్కిపడుతున్నారు: పైడికొండల మాణిక్యాల రావు
ఇది ఇలా ఉండగా, మరో బీజేపీ నేత, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు కూడా చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాణిక్యాలరావు మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని దుయ్యబట్టారు.
ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గల నియోజకవర్గాలకు నిధులు నిలుపుదల చేస్తోందని ఆరోపించారు. దేశంలో రాష్ట్రంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. చందబ్రాబు కారణంగా ఏపీకి ఇంత అన్యాయం జరగుతుంటే తాము చాలా బాధపడుతున్నామని విచారం వ్యక్తం చేశారు.
తమకు కూడా రోషం ఉందని, కానీ అది రాజకీయ రోషం మాత్రం కాదని, నిజమైన రోషమని చంద్రబాబుకు మాణిక్యాలరావు చురకలంటించారు. అంతేగాక, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందన్నారు.








