33.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home ఎన్ఆర్ఐ అమెరికా ఎన్నారై చిగురుపాటి జయరాం అనుమానాస్పద మృతి.. కారు వెనుక సీటులో మృతదేహం!

ఎన్నారై చిగురుపాటి జయరాం అనుమానాస్పద మృతి.. కారు వెనుక సీటులో మృతదేహం!

nri-chigurupati-jayaram
- Advertisement -

nri-chigurupati-jayaram-found-dead

విజయవాడ: అమెరికాలో తెలుగు వారందరికీ సుపరిచితమైన ఎన్నారై చిగురుపాటి జయరాం కృష్ణా జిల్లా నందిగామ వద్ద కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఓ కారు వెనుక సీటులో వ్యక్తి మృతదేహం ఉందంటూ స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఆ కారు వెనుక సీటులో ఉన్నది ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ అధినేత చిగురుపాటి జయరామ్‌గా గుర్తించారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చిగురుపాటి జయరాం.. సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. అమెరికాలోని న్యూయార్క్‌లో చదువుకుని, అక్కడే స్థిరపడిన ఆయన ఎక్స్‌ప్రెస్ టీవీని కూడా స్థాపించారు. ఆ తర్వాత నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు.

కోస్టల్ బ్యాంక్ అధినేతగా, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీగా ఆయన అటు అమెరికాలోనూ ఇటు స్వదేశంలోనూ అందరికీ సుపరిచుతులు. ఔషధాలు, అద్దాల తయారీ పరిశ్రమల్లో కూడా ఆయనకు వాటాలు ఉన్నాయి.

కుటుంబ కలహాలా? వ్యాపార లావాదేవీలా?

చిగురుపాటి జయరాం భార్యాపిల్లలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. ఆయన మృతికి వ్యాపార లావాదేవీలే కారణమా? లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఆయన విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ఎవరైనా ఆయన్ని హత్య చేశారా? అనే కోణంలోనూ పోలీసుల విచారణ సాగుతోంది.

విషప్రయోగం ఏమైనా జరిగిందా?

జయరాం మృతదేహం లభించిన కారులో మద్యం సీసాలు కూడా ఉండడంతో ఆయనపై విషప్రయోగం ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన వ్యాపార ప్రత్యర్థులు ఎవరైనా మద్యంలో విషం కలిపి తాగించి హతమార్చి ఉంటారా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఒకవేళ ఆయనది ఆత్మహత్యా? ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

మృతిపై పలు అనుమానాలు…

కారు వెనుక సీట్లో జయరాం మృతదేహం పడి ఉండటం, ఆయన తలపై గాయాలు కనిపిస్తుండడంతో వల్ల కూడా చిగురుపాటి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల కిందటే జయరాం విజయవాడకు వచ్చినట్టు తెలుస్తోంది.

సాధారణంగా డ్రైవర్ లేకుండా ఆయన ఎక్కడికీ వెళ్లరని సమాచారం. దీంతో కారును నడిపింది ఎవరు? విజయవాడలో ఆయన ఎవరెవరిని కలిశారు? అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -