ఎట్టకేలకు.. సీబీఐ కొత్త చీఫ్‌గా రిషికుమార్ శుక్లా! ఖర్గే వ్యతిరేకించినా.. ప్రధాని, సీజేఐ ఆమోదం

Rishi_Kumar_Shukla
- Advertisement -

న్యూఢిల్లీ: ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పూర్తిస్థాయి కొత్త డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషికుమార్‌ శుక్లా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిషికుమార్‌ శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌ పదవిలో ఆయన కొనసాగనున్నారు.

తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. విపక్ష కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిషికుమార్‌ను సీబీఐ బాస్‌గా ప్రభుత్వం నియమించింది. శుక్రవారం మోడీ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు సీజే రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు.

చదవండి: సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ షాకింగ్ నిర్ణయం: ఉద్యోగానికి రాజీనామా, అదే కారణమా?

ప్రభుత్వం ప్రతిపాదించిన రిషికుమార్‌ పేరును ఖర్గే వ్యతిరేకించారు. అయితే ప్రధాని, సీజేఐ ఆమోదంతో 2-1 మెజారిటీతో రిషికుమార్‌ను సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కాగా, సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించిన విషయం తెలిసిందే. రాకేశ్‌ ఆస్థానాతో విభేదాల కారణంగా అలోక్‌ వర్మ పదవి కోల్పోయారు.

కాగా, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌ బాధ్యత స్వీకరించకుండా ఉన్నందుకు అలోక్ వర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ నిర్ణయించింది. తన ఉద్యోగానికి అలోక్ వర్మ చేసిన రాజీనామాను కూడా తిరస్కరించింది. వర్మపై విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన రాజీనామాను ఆమోదించబోమని ఓ సీనియర్ మంత్రి చెప్పడం గమనార్హం.

- Advertisement -