
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇందులో భాగంగా.. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలు ఇప్పటికే జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.
వైసీపీ అభ్యర్థులను ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. వైసీపీ అభ్యర్థులుగా పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలను అధిష్టానం ప్రకటించింది.
టీడీపీ కూడా ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా పరిమళ్ నత్వానీని ఖరారు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో తమ సంస్థ తరఫున ప్రభుత్వంలో వ్యవహారాలు పర్యవేక్షించే పరిమళ్ నత్వానీ అనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వవలసిందిగా కోరడానికై రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో కలిశారు.
తమ తరఫున ఒకరికి రాజ్యసభ సీటు కావాలని ముఖేశ్ అంబానీ ఒక రాజకీయ పార్టీని కోరడం ఇదే మొదటిసారి.
ముఖేశ్–జగన్ మధ్య సమావేశాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.
రాజ్యసభ పదవీకాలం ముగియనున్న నత్వానీ మళ్లీ ఆ పదవిని కోరుకుంటున్న విషయం తెలుసుకున్న విజయసాయి రెడ్డి అటునుంచి నరుక్కువచ్చారని, నత్వానీని ప్రయోగించి ముఖేశ్ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేలా ఏర్పాటుచేశారని గుసగుసలు వినిపించాయి.








