
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నేడు కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరింది. కరోనా కారణంగా నేడు ఆరుగురు మృతి చెందారు. ఫలితంగా కరోనా మరణాలు 88కి పెరిగాయి.
కరోనా కారణంగా ఆదివారం కూడా ఐదుగురు చనిపోయారు. కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 మంది కరోనా బారినపడ్డారు. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గ్రేటర్‌లోనే ఎక్కువగా ఉన్నాయి.
రంగారెడ్డిలో 3, మేడ్చల్‌లో 3, మెదక్, నల్గొండ, సంగారెడ్డిలో రెండేసి కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్‌లో, పెద్దపల్లిలో, జనగాంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
ఇప్పటి వరకు 1,491 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,213 యాక్టివ్ కేసులున్నాయి.
గత నెలతో పోల్చితే మే నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మే 31న అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయి. జూన్, జులై నెలల్లో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.








