25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం లాక్‌డౌన్ సడలింపులతో మోగిన రైలు కూత.. ఢిల్లీ నుంచి పలు నగరాలకు 15 ప్రత్యేక రైళ్లు!

లాక్‌డౌన్ సడలింపులతో మోగిన రైలు కూత.. ఢిల్లీ నుంచి పలు నగరాలకు 15 ప్రత్యేక రైళ్లు!

railway-board-key-decisions-15-special-trains-from-new-delhi-from-tuesday
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఈ నెల 12 (మంగళవారం) నుంచి రైళ్లను నడపాలని భారతీయ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. 

ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడానికి ముందే రైల్వే బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. 

దీంతో న్యూఢిల్లీ నుంచి దేశంలోని వివిధ నగరాలకు 15 ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ నడిచే మార్గాల్లోనే ఈ రైళ్లు కూడా ప్రయాణిస్తాయి.

అంతేకాదు, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వసూలు చేసే ఛార్జీలనే ఈ ప్రత్యేక రైళ్లలోనూ వసూలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని రైల్వే జోనల్ మేనేజర్లకు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ప్రత్యేక రైళ్లు తిరిగే అన్ని మార్గాల్లోని స్టేషన్లలో ఈ మేరకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది. 

రైల్వే బోర్డు కీలక నిర్ణయాలు ఇవే…

– ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ కంపార్ట్‌మెంట్స్ మాత్రమే ఉంటాయి.
– ప్రయాణికులు ఆన్‌లైన్‌లో.. అదీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.
– ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టిక్కెట్ల బుకింగ్‌కు అనుమతి లేదు.
– 7 రోజులపాటు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ ఉంటుంది.
– వెయిటింగ్‌ లిస్ట్, ఆర్‌ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ టిక్కెట్లు జారీ చేయరు. కేవలం ఖరారైన టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు.
– టిక్కెట్ల క్యాన్సిలేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే చేయాలి. అది కూడా 24 గంటల ముందుగానే క్యాన్సిల్ చేసుకోవాలి.
– టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికులకు 50 శాతం ఛార్జీని మాత్రమే ఐఆర్‌సీటీసీ తిరిగి చెల్లిస్తుంది.
– రాజధాని రైళ్లలో గతంలో దుప్పట్లు, టవల్స్ సరఫరా చేసే వారు. కానీ ఈ ప్రత్యేక రైళ్లలో మాత్రం అలాంటి సౌకర్యాలు ఉండవు.
– ఇక ఆహారం విషయానికొస్తే.. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారు ఎవరి ఆహారం వాళ్లే తీసుకొచ్చుకోవడం శ్రేయస్కరం.
– రైళ్లలో ప్రయాణికులకు డ్రై, రెడీ టూ ఈట్ ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తారు. అది కూడా ఫుడ్ ఆన్ పేమెంట్  ప్రాతిపదికపై మాత్రమే.
– ఈ రకం ఆహార పదార్థాలు కావలసి వారు టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే వీటిని కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

- Advertisement -