27.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం నేటి రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మళ్లీ ప్రధాని మోడీ ప్రసంగం.. లాక్‌డౌన్ ఎత్తేస్తారా? పొడిగిస్తారా?

నేటి రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మళ్లీ ప్రధాని మోడీ ప్రసంగం.. లాక్‌డౌన్ ఎత్తేస్తారా? పొడిగిస్తారా?

prime-minister-modi-to-address-the-nation-today-at-8pm
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి 8 గంటలకు మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా తెలిపింది. 

నిన్న అంటే సోమవారం (11 మే 2020) రోజున మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 

ఈ నేపథ్యంలో మళ్లీ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ప్రధాని లాక్‌డౌన్ ఎత్తివేయనున్నారా? లేకపోతే మళ్లీ మరికొంత కాలంపాటు పొడిగించనున్నారా? అనే అంశం చర్చనీయాంశమైంది. 

సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో…

సోమవారంనాటి వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ మాట్లాడుతూ.. కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలులో అన్ని రాష్ట్రాలు కీలక పాత్రను పోషించాయంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ప్రశంసించారు.

కోవిడ్-19 మహమ్మారి నుంచి భారత్ తనను తాను సమర్థంగా రక్షించుకుందని యావత్ ప్రపంచం భావిస్తోందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాలు అత్యంత కీలకంగా వ్యవహరించినా.. సోషల్ డిస్టెన్స్ పాటించని చోట్ల సమస్య పెరిగిందన్నారు.

లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ ఈ మహమ్మారి వ్యాపించకుండా చూడడం మన ముందున్న అతిపెద్ద సవాలు అని మోడీ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించి ముందుకు సాగాల్సిన తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన మోడీ.. కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. 

ఏదిఏమైనా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే దేశం ఏ దిశగా పయనించాలి, ఇంకా ఏమేం చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.  

లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు!?

మరోవైపు, ప్రధాని మంగళవారం రాత్రి మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారనే వార్త వెలువడిన వెంటనే ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మోడీ మరో రెండు వారాలపాటు పొడిగించనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్19 కేసులు పెరిగిపోతుండడంతో లాక్‌డౌన్ పొడిగింపు తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అయితే ఈ దఫా.. లాక్‌డౌన్ పొడిగించినా.. సడలింపులు మరిన్ని ఇచ్చే అస్కారం ఉందని కొందరు పేర్కొంటుండగా.. మరికొందరేమో.. ఈసారి మోడీ ప్రజలకు మళ్లీ ఏం టాస్క్ ఇస్తారో అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 

- Advertisement -