

న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది భారత్. వాణిజ్యం పెంపుతో సహా పలు వెసులుబాటులు కల్పించేలా ఉద్దేశించి పాకిస్తాన్‌కు ఇచ్చిన ఎంఎఫ్‌ఎన్ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను భారత్ ఉపసంహరించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ (సీసీఎస్) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి పాకిస్థాన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ పాకిస్థాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం. ప్రపంచ వేదికపై పాక్‌ను ఏకాకి చేయడానికి విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకోనుంది. ఈ దారుణ ఘటన వెనక పాక్ హస్తమున్నట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం..’ అని జైట్లీ తెలిపారు.
సైనికులపై దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. భారత్‌ను రెచ్చగొడుతున్న పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ ఘటనపై శనివారం అఖిలపక్షం నిర్వహిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఉగ్రదాడిపై ప్రధాని నేతృత్వంలో సమీక్ష
కాగా, ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరయ్యారు.
సమావేశం ప్రారంభం కాగానే… అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సుమారు 55 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై సమీక్షించారు.
యురి ఘటనకంటే ఈ ఉగ్రదాడిలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండటంతో.. ఉగ్రవాద మూకలకు గట్టి హెచ్చరిక పంపే విధంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఈ ఘటనలో భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై కూడా సమీక్షించారు.
కాశ్మీర్‌లోని అవంతిపురలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనశ్రేణిపై గురువారం ఉగ్రవాదులు దాడి చేయడంతో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నాటి తమ రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
సంబంధిత వార్తలు
అతిపెద్ద ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి, 40 మంది జవాన్లు మృతి
ఆలోగా నేను స్వర్గంలో ఉంటా: ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్
పుల్వామా ఘటన : పక్కా ప్లాన్‌తోనే దాడి? అమరులైన 43 మంది జవాన్లు!
సంభాషణ అనేది గదుల్లో కాకుండా..యుద్ధ మైదానంలో ఉండాలి! యుద్దానికి సిద్దంకండి గౌతమ్ గంభీర్!








