23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అరుణ్ జైట్లీ మృతి: ప్రముఖుల సంతాపం, ఎవరేమన్నారంటే…

అరుణ్ జైట్లీ మృతి: ప్రముఖుల సంతాపం, ఎవరేమన్నారంటే…

former-finance-minister-arun-jaitley
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ విచారం వెల్లువెత్తుతోంది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స నిమిత్తం ఈ నెల 9న ఎయిమ్స్‌లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు మూగబోయాయి. జైట్లీ మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 

అరుణ్ జైట్లీ మరణం తనకు తీవ్ర విచారం కలిగించిందని, జాతి నిర్మాణానికి ఆయన ఎనలేని సేవలు అందించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

‘‘అద్భుత న్యాయవాదిగా, గొప్ప పార్లమెంటేరియన్‌గా, విశిష్ట మంత్రిగా ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఎంతో కష్టమైన బాధ్యతలనైనా తొణకుండా పూర్తి చేసే సామర్థ్యం ఆయన సొంతం. రాజకీయల్లో, మేధో సమాజంలో ఆయన మరణం తీరని లోటును మిగిల్చింది’’ అని రాష్ట్రపతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

జైట్లీ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ బాధను వ్యక్తం చేసేందుకు మాటలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. జైట్లీ అపర మేధావి, పాలనాదక్షుడు, గొప్ప విలువలున్న వ్యక్తి.. అని ఆయన వ్యాఖ్యానించారు. 

జైట్లీ మరణం దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, తనకున్న అత్యంత సన్నిహితుల్లో ఒకరని చెప్పారు.

అంతేకాదు, విప్లవాత్మకమైన జీఎస్‌టీ విధానంపై రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జైట్లీ రేయింబవళ్లు కృషి చేశారని వెంకయ్యనాయుడు కొనియాడారు. 

అలాగే వాజ్‌పేయి, మోడీ మంత్రివర్గాలలో ఆయన కీలక శాఖలను సమర్థంగా నిర్వహించారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంటూ ఒక  ప్రకటన విడుదల చేసింది.

ఇక విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ జైట్లీ మృతిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. అరుణ్ జైట్లీ రాజకీయాల్లో అత్యంత ఉన్నతమైన వ్యక్తి, విజ్ఞాని, న్యాయ కోవిదుడు. అద్భుత వాక్పటిమ గల నాయకుడు, దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన మృతి చాలా బాధాకరం. ఆయన భార్య, కుమారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అరుణ్ జైట్లీ మరణంపై ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జైట్లీ జీ మరణం తనకు ఎంతో దుఃఖాన్ని కలిగించిందని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని పేర్కొన్నారు. కేవలం ఓ సీనియర్ నేతగానే కాదు, ఓ కుటుంబంలో సభ్యుడిగా కూడా ఆయన ఇన్నేళ్లుగా తనకు మద్దతు, మార్గదర్శనాన్ని అందించారని పేర్కొన్నారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ట్వీట్ ద్వారా అరుణ్ జైట్లీ మృతిపై స్పందించారు. తనలాంటి వారెందరికో ఆయన మార్గదర్శి అని ఆమె పేర్కొన్నారు.

ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, జైట్లీ విశాల హృదయమున్న వ్యక్తి అని, సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండేవారని తెలిపారు. తెలివితేటల్లో, చురుకుతనంలో, సూక్ష్మబుద్ధిలో ఆయనకు సాటి లేరని నిర్మలా సీతారామన్ తన ట్వీట్‌లో కొనియాడారు.  

అరుణ్ జైట్లీ మృతిపై ట్విటర్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ… ఎన్నో పదవుల్లో ఆయన దేశానికి సేవ చేశారని, పార్టీకి, ప్రభుత్వానికి ఆయనో ఓ ఆస్తి వంటివారని అన్నారు. ఆయనో సమర్థుడైన న్యాయవాది, రాజకీయ నాయకుడు,  నాకు స్నేహితుడు, విలువలతో కూడిన సహవాసి.. జైట్లీ మరణం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. 

అన్నిరకాల అంశాలపై ఆయనకు లోతైన, స్పష్టమైన అవగాహన ఉండేదని, ఆయన విజ్ఞానం, వాక్పటిమ ఆయనకు ఎందరో స్నేహితులను సంపాదించి పెట్టిందని రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో తెలిపారు. అంతేకాదు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప నేతగా జైట్లీని దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఆయన మరణం బీజేపీకి తీరని లోటు అని పేర్కొన్నారు.

- Advertisement -