
తిరువనంతపురం: టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొచ్చిలోని ఎడపల్లి ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
అయితే, వెంటనే అప్రమత్తం కావడతో పెను ప్రమాదం తప్పింది. మంటలు ఎగసిపడుతున్నప్పుడు శ్రీశాంత్ భార్య, పిల్లలు, పనిమనిషి ఆ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్నారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. అతడు ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్నాడు. శ్రీశాంత్ ఇంట్లోంచి మంటలు వస్తుండడం చూసి అప్రమత్తమైన పక్కింటి వ్యక్తి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. అనంతరం ఇంట్లోని వారిని అప్రమత్తం చేయడంతో వారు క్షేమంగా బయటపడ్డారు.
తన ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుందనే విషయం తెలిసిన వెంటనే శ్రీశాంత్ కొచ్చి చేరుకున్నాడు. తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోని డ్రాయింగ్ రూములో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో తన భార్య, పిల్లలు మొదటి అంతస్తులో ఉన్నారని శ్రీశాంత్ తెలిపాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు పూర్తిగా తెలియరాలేదు. అయితే సీలింగ్ ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్టు సంబంధిత అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.








