22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అరుణ్ జైట్లీ మృతి: నివాసానికి చేరిన పార్థివదేహం.. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు…

అరుణ్ జైట్లీ మృతి: నివాసానికి చేరిన పార్థివదేహం.. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు…

arun-jaitley-dead-body-at-his-residence
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంతిమ సంస్కారాలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన జైట్లీ అక్కడ కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

శ్వాసపరమైన సమస్యలతో ఆగస్ట్ 9న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. గత శనివారం సాయంత్రం ఆయన్ని చూసేందుకు ఎయిమ్స్‌కు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్… అక్కడి వైద్యులను అడిగి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంతకుముందు ఆగస్టు 9న ప్రధాని మోడీ, ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్‌వర్ధన్ కూడా ఎయిమ్స్‌కు వచ్చిన జైట్లీని పరామర్శించారు.

విషాదంలో బీజేపీ శ్రేణులు…

అరుణ్ జైట్లీ మరణవార్త వినగానే బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.  ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిమ్స్‌కు తరలివెళ్లారు. అనంతరం అక్కడ్నించి జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు.

అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల దర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. ఆదివారం ఉదయం జైట్లీ  పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నాయి.

ఇక అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా నిగమ్ బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జైట్లీ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.  మరోవైపు, జైట్లీ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేసింది. జైట్లీ కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

- Advertisement -