21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మోడీని విచారించాల్సిందే: రఫేల్ డీల్‌పై రాహుల్ తీవ్ర విమర్శలు

మోడీని విచారించాల్సిందే: రఫేల్ డీల్‌పై రాహుల్ తీవ్ర విమర్శలు

- Advertisement -

న్యూఢిల్లీ: రఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ గురువారం తీవ్రంగా స్పందించారు.

‘పత్రాలు చోరీ అయ్యాయని ప్రభుత్వం చెప్పిందంటే అందులోని సమాచారం నిజమైనదేనని స్పష్టమవుతోంది. అంటే ఒప్పందంలో అవినీతి జరిగిందని రుజువైంది’ అని కేంద్రాన్ని దుయ్యబట్టారు.

‘రఫేల్‌ పత్రాలు కన్పించకుండా పోయాయి. అంటే అందులోని సమాచారం నిజమేనని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చూస్తే రఫేల్‌ ఒప్పందంలో మోడీ జోక్యం ఉంది. ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపారనేది రుజువైంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఒప్పందానికి బైపాస్ సర్జరీ చేశారు..

‘రఫేల్ పత్రాల చోరీపై దర్యాప్తు జరుపుతామని కేంద్రం చెబుతోంది. కానీ రూ. 30వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తిపై(మోడీని ఉద్దేశిస్తూ) మాత్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టట్లేదు. రఫేల్‌ ఒప్పందానికి మోడీ బైపాస్‌ సర్జరీ చేశారు. అనిల్‌ అంబానీకి ప్రయోజనం చేకూర్చేందుకే కొనుగోలును ఆలస్యం చేశారు. అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలి. ప్రధానిని కూడా విచారించాలి’ అని రాహుల్‌ అన్నారు.

ఎన్డీయే హయాంలో ఉద్యోగాలు పోయాయి.. ఆర్థిక వృద్ధి పోయింది.. ఇప్పుడు రఫేల్‌ పత్రాలు కూడా కన్పించకుండా పోయాయని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కానీ చౌకీదార్‌ మాత్రం భద్రంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రఫేల్ వ్యవహారంలో మోడీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు.

చదవండి: రఫేల్ పత్రాలు పోయాయి, చర్యలు తీసుకుంటాం: సుప్రీంకు చెప్పిన కేంద్రం

- Advertisement -