
ఢిల్లీ: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు భద్రతాబలగాలతో వెళుతున్న ఓ వాహనాన్ని శక్తిమంతమైన ఐఈడీతో పేల్చివేసిన ఘటనలో 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. వీరిలో ఓ డ్రైవర్, 15 మంది జవాన్లు అమరులయ్యారు. ఐఈడీ పేలుడు తీవ్రతకు జవాన్ల వాహనం తుక్కుతుక్కయింది.
అసలు ఏం జరిగిందంటే…
మహారాష్ట్రలోని గడ్చీరోలి జిల్లాలో సీ-60 కమాండ్ యునిట్‌కు చెందిన జవాన్లు రెండు ప్రైవేటు వాహనాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కుర్కేడ ప్రాంతానికి సమీపంలో ఉన్న లెందారి అటవీ ప్రాంతంలోకి జవాన్లకు చెందిన ఎంహెచ్33టీ 0483 నెంబరు గల వాహనం రాగానే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి భారీ విస్ఫోటనం సంభవించింది.
ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లతో పాటు ఒక ప్రైవేటు డ్రైవర్ సైతం మృతి చెందారు. అయితే గత ఏడాది మే 22వ తేదీన గడ్చీరోలి జిల్లాలోని ఎటపల్లి ప్రాంత సమీపంలో సిఆర్‌పిఎఫ్ జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక అప్పటి నుంచి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న మావోయిస్టులు ఇదే అదునుగా భావించి ఈ ఘటనకు తెరలేపినట్లు తెలుస్తోంది.
తీవ్రంగా స్పందించిన మోడీ…
ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, జవాన్ల ప్రాణాలను బలిగొన్నవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలు చిరకాలం గుర్తుంచుకుంటామని అన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
మోడీపై కాంగ్రెస్ ఫైర్..
ఇదిలా ఉంటే పుల్వామా ఘటన నుంచి కేంద్రం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని…అది గడ్చిరోలి సంఘటనతో మరోసారి రుజువైందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు. ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మరోసారి జవాన్లు బలయ్యారని…ఇది మోడీ సర్కారు వైఫల్యంగానే భావించాలని అన్నారు. ఈ వైఫల్యానికి మోడీ ఎలాంటి సమాధాన చెబుతారో చూడాలని చెప్పారు.
చదవండి: ఓ కార్మికుడా… మళ్ళీ యుద్ధం మొదలు పెడదామా…?








