

న్యూఢిల్లీ: దేశ సమగ్ర వికాసమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకోలేదని తెలిపారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి వర్గానికి మేలు కలగాలనేది తమ ఆశయమని స్పష్టం చేశారు.
రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున చెల్లింపు నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా పీయూష్ అభివర్ణించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి 2018 డిసెంబర్ నుంచే అమలవుతుందని చెప్పారు. రూ. 6 వేల ఆర్థిక సాయం చిన్న రైతులకు గొప్ప ఊరటనిస్తుందని, ఇదొక చారిత్రక నిర్ణయమని పీయూష్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో 12.5 కోట్ల మంది రైతులు లబ్ధిపొందనున్నారన్నారు.
చదవండి: కేంద్ర బడ్జెట్ 2019: మధ్య తరగతి, రైతులపై వరాల వర్షం, పార్లమెంటులో పీయూష్ గోయల్ ప్రసంగం
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2018 డిసెంబరు నుంచే అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేసే పింఛన్ పథకం కూడా చాలా గొప్పదన్నారు. పింఛన్ పథకం ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
ఇప్పటికే ముద్ర రుణాల ద్వారా అసంఘటిత రంగ కార్మికులను ఆదుకున్నామని పీయూష్ గోయల్ తెలిపారు. నామమాత్రమైన రూ.100 ప్రీమియం చెల్లిస్తే రూ.3వేలు పింఛను ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.








