

హైదరాబాద్: రాంగోపాల్ వర్మ… ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. టాలీవుడ్, బాలీవుడ్లో స్టార్ హీరోలతో సినిమాలని రూపొందించి సంచలనాలు నమోదు చేసిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం ఈయన పేరుకే ఒక బ్రాండ్ ఉంది. వర్మ సినిమా ఏదైనా కూడా ఒక వివాదంతోనే మొదలౌతుంది.. ఇది అందరికీ తెలిసిన విషయమే.
అలాగే ఆ వివాదాన్ని కూడా తన సినిమాకి ఫ్రీ పబ్లిసిటీగా ఎలా వాడుకోవాలో రాంగోపాల్ వర్మకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని చెప్పొచ్చు. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునతో తీసిన ‘శివ’ నుండి మొదలైన వర్మ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ రాంగోపాల్ వర్మ సినిమా అంటే చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతారంటే అర్థం చేసుకోవచ్చు అయన క్రేజ్ ఎలాంటిదో.
ఆ సినిమా ఎప్పుడొస్తే.. నాదీ అప్పుడే: వర్మ
ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. నందమూరి నటసింహం నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ (రెండు భాగాలు) చిత్రాలకు పోటీగా రూపొందిస్తున్నారు వర్మ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ విషయమై వర్మ స్పందించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చిన 24 నిమిషాల్లోనే తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తానంటూ తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారాయన .
ఈ వ్యాఖ్యలని చూస్తుంటే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి పోటీగా బరిలోకి దించే అవకాశాలున్నాయని సినీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.








