

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ఎన్నికల సన్నాహక బడ్జెట్‌గా ముందుకు తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి, రైతులకు, అన్ని వర్గాలపై వరాల వర్షం కురిపించింది. ఈ బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ 3.36 లక్షల కోట్లుగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. అయితే, ప్రభుత్వం వ్యయం 13.3 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు.
చదవండి: కేంద్ర బడ్జెట్ 2019: మధ్య తరగతి, రైతులపై వరాల వర్షం, పార్లమెంటులో పీయూష్ గోయల్ ప్రసంగం
ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమానికీ ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం ఈ రంగానికి రూ. 76.800 కోట్ల కేటాయింపులు జరిపింది. పన్ను మినహాయింపులతో పట్టణ ప్రాంత ప్రజలను, వేతన జీవులను ఆకట్టుకున్న ప్రభుత్వం గ్రామీణ రంగంలో రైతులకు ఊరట ఇచ్చేలా నగదు సాయం పథకం ప్రకటించింది. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ 76,800 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన మోదీ సర్కార్ దళితులను అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
అంగన్‌వాడీల జీతం 50శాతం పెంపు
ఈ బడ్జెట్ మహిళలకు పెద్ద పీట వేసిందని పీయూష్ గోయల్.. అంగన్ వాడీలకు కూడా తీపికబురునందించారు. అంగన్‌వాడీ సిబ్బంది వేతానాన్ని 50 శాతం పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ‘ప్రధాన్ మంత్రి ముద్రా యోజన’ పథకంలో 75 శాతం మంది మహిళా లబ్ధిదారులున్నట్లు తెలిపారు. ‘మాతృత్వ యోజన’ పథకం ద్వారా మహిళా ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు ఇస్తున్నట్లు తెలిపారు.
చదవండి: కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి భారీగా పెంపు, అసంఘటిత కార్మికులకు రూ.3 వేల పింఛను, ఇంకా…
అంతేగాక, గ్రామీణ ప్రాంతాల్లోని 8 కోట్ల మందికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాడానికి రూపొందించిన ‘ప్రధాన్ మంత్రి ఉజ్వాలా యోజన ’పథకంలో భాగంగా ఇప్పటికే 6 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, ఇంటి అద్దె పన్ను పరిమితిని కూడా 2.4లక్షలకు పెంచినట్లు తెలిపారు.








