గుజరాత్‌పై రాహుల్ ఫోకస్: కాంగ్రెస్ గూటికి హార్థిక పటేల్

hardik patel

గాంధీనగర్: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో గుజరాత్‌లోని పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేసిన హార్థిక్ పటేల్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.

స్వాగతం పలికిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో హార్థిక్ పటేల్ మంగళవారం ఆ పార్టీలో చేరారు. అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ కండువా కప్పిన రాహుల్.. హార్థిక్‌ను సాదరంగా ఆహ్వానించారు.

కాగా, హార్థిక్ పటేల్‌ను జామ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గుజరాత్‌లో కీలకంగా ఉన్న పటేల్ సామాజిక వర్గం ఓట్లను రాబట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్.

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

చదవండి: పాపులారిటీ: ఆ రెండు వర్గాల్లో మోడీని మించిపోయిన రాహుల్!