మధుర: భూమ్మీద నూకలుండాలేగానీ ఎంతటి విపత్కర పరిస్థితిలోంచి కూడా బయటపడొచ్చు అనడానికి ఉదాహరణ ఈ ఘటన. ఉత్తర ప్రదేశ్‌లోని మధుర రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఒళ్లు జలదరించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి రైల్వే స్టేషన్‌లో తల్లి చేతుల్లోంచి జారి ప్లాట్ ఫారమ్ పక్కనున్న పట్టాల పక్కన పడిపోయింది.
సరిగ్గా అదే సమయంలో ఆ పట్టాలపైనుంచి రైలు శరవేగంతో వెళ్లింది. అయినా ఆ చిన్నారికి చిన్న గాయం కూడా కాలేదు. ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడింది.
ఈ అద్భుతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధుర రైల్వే స్టేషన్‌లో ఓ జంట ప్లాట్ ఫారమ్ పైన రైలు కోసం వేచి చూస్తూ నిలబడింది. రైలు అనౌన్స్‌మెంట్ విని వారు పరుగెత్తుకు వచ్చారు. ఆ తొందరలో తల్లి చేతుల్లో ఉన్న పాప పట్టాల పక్కన, ప్లాట్ ఫారానికి మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది.
దీంతో అక్కడున్న వారంతా ఏం జరుగుతుందో అని భయాందోళనలకు లోనయ్యారు. అంతలోనే రైలు ముందుకు కదిలింది. ఇక అక్కడున్న అందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. రైలు పూర్తిగా ముందుకు వెళ్లిన తర్వాత చూస్తే పాప సురక్షితంగా ఉంది. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH: One-year-old girl escapes unhurt after a train runs over her at Mathura Railway station. pic.twitter.com/a3lleLhliE
— ANI UP (@ANINewsUP) November 20, 2018