షాకింగ్: సనత్ జయసూర్యపై స్మగ్లింగ్ ఆరోపణలు, శ్రీలంక క్రికెట్ దిగ్గజం ఇమేజంతా ‘వక్కలు’!

sanath-jayasuriya-in-smuggling-case
- Advertisement -

betel-nuts-smuggling-jayasuriya

నాగ్‌పూర్: క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సనత్ జయసూర్య. ప్రచంచ క్రికెట్‌లో శ్రీలంకను ఓ బలమైన శక్తిగా నిలిపిన క్రికెటర్లలో జయసూర్య కూడా ఒకడు. అలాంటి జయసూర్య ఇప్పుడు స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ  క్రికెట్ దిగ్గజంతోపాటు మరో ఇద్దరు క్రికెటర్లకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. శ్రీలంక నుంచి దిగుమతి అయిన రూ.కోట్ల విలువైన వక్కలను నాగ్ పూర్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీజ్ చేసింది.

ఈ కేసులో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య పేరు బయటకు వచ్చినట్టు ‘దైనిక్ భాస్కర్’ పత్రిక పేర్కొంది. జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఈ స్మగ్లింగ్ లో పాలుపంచుకున్నట్టు తెలిపింది.  అయితే ఇద్దరు ఎవరన్నది ఇంకా తెలియడం లేదు.  ఈ కేసులో విచారణ కోసం జయసూర్య ఇప్పటికే ఒకసారి ముంబై వచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ వీరందరినీ డిసెంబర్ 2న విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే…

ఇండొనేషియా నుంచి ఇండియాకు వక్కలను ఎగుమతి చేస్తారు. అయితే నేరుగా భారతదేశానికి ఎగుమతి చేస్తే అధిక పన్నులను (108 శాతం దిగుమతి పన్ను) చెల్లించాల్సి ఉంటుందని.. మలేషియా నుంచి శ్రీలంకకు తీసుకొచ్చి, అక్కడి నుంచి ఇండియాకు తరలిస్తున్నారు.  శ్రీలంక నుంచి ఇండియాకు వస్తే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

దీనిని ఆసరాగా తీసుకుని వ్యాపారులు శ్రీలంకను అక్రమమార్గంగా ఎంచుకున్నారు. ఈ వ్యాపారం కోసం మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యతో పాటు ఇతర క్రికెటర్లు డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని… వీరు ఆయా సంస్థలకు వాణిజ్య, ఎగుమతి లైసెన్స్‌లు పొందారు.

అంతేకాదు, భారత్‌కు ఎగుమతి చేసిన వక్క పలుకులు శ్రీలంకలోనే ఉత్పత్తి అయినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం వాటిని భారత్‌కు తరలిస్తున్నారు.  నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వక్కలను దిగుమతి చేసుకోవడం ద్వారా బాగా లాభాలు ఆర్జించాడు. శ్రీలంకలోని వ్యాపారవేత్త కుళ్లిన వక్కలను నాగ్‌పూర్‌లోని భారత వ్యాపారవేత్తకు అసలు ధరలో కేవలం 25 శాతానికే విక్రయిస్తున్నాడు.

అంటే.. వక్కల అసలు ధర వంద కోట్ల రూపాయలు అనుకుంటే వాటిని 25 కోట్ల రూపాయలకే విక్రయించడం అన్నమాట. అనంతరం నాగ్‌పూర్‌ వ్యాపారవేత్త వాటిని నాణ్యమైన వక్క పలుకుల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయించుకుంటున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ సివారే తెలిపారు.

మరోవైపు వక్కల అక్రమ రవాణాలో సనత్ జయసూర్య పేరు బయటికి రావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

- Advertisement -