హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీఆర్‌ఎస్ ప్రకటించింది.
యాదవ రెడ్డి కూడా యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా నేడు మేడ్చల్‌లో జరిగే ప్రచార సభలో సోనియా సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇకపోతే మరో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
పార్టీని వీడే నేతలను ముందుగానే గుర్తించే పనిలో పడింది టీఆర్‌ఎస్ అధిష్ఠానం. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు అర్థమవుతోంది.