24 గంటల్లో 1,710 కరోనా కేసులు.. నాగ్‌పూర్‌లో మళ్లీ వారం రోజులు లాక్‌డౌన్!

- Advertisement -

ముంబై: కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.

దీంతో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల దిశగా పయనిస్తోంది. తాజాగా నాగ్‌పూర్‌లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 13,659 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క నాగ్‌పూర్‌లోనే 1,710 కేసులు వెలుగుచూశాయి.

దేశ వ్యాప్తంగా గనుక చూసుకుంటే నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్ర నుంచే 60 శాతం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

అత్యవసర సేవలకు మినహాయింపు…

దీంతో ఈ నెల 15 నుంచి 21 వరకు నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధిస్తూ ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాగ్‌పూర్‌లోని అన్ని ప్రాంతాల్లో ఈ లాక్‌డౌన్ అమలులోకి రానుంది.

అయితే అత్యవసర సేవలైన పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణా వస్తువులు లభ్యమయ్యే దుకాణాలు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అంతేకాదు రాబోయే కొద్దిరోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకూ ఈ లాక్‌డౌన్ విస్తరించాలని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలోని జల్గావ్ జిల్లాలో జనతా కర్ఫ్యూ అమలు అవుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ మార్చి 8వ తేదీ నుంచి.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలు అవుతోంది.

మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లనూ లాక్‌డౌన్ విధించాలని భావిస్తున్నామని చెప్పారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

- Advertisement -