రాంచరణ్, తారక్ అభిమానులకు నిరాశ!.. ‘ట్రిపుల్ ఆర్’ మరోమారు వాయిదా?

- Advertisement -

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజానికి అక్టోబరు 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం ఏడాది నుంచి అభిమానులు ఆతృతగా నిరీక్షిస్తున్నారు.

అయితే, ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ వాయిదాపడిన ఈ సినిమా మరోమారు వాయిదా పడే అవకాశాలున్నట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ట్రిపుల్ ఆర్’లో మరో పాటను త్వరలో చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది.

రాంచరణ్, అలియా భట్‌పై ఈ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందని, విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే పూర్తి కావాల్సి ఉండగా, మరో నెలరోజులు పొడిగించబోతున్నారనేది టాలీవుడ్ సమాచారం. ఇందుకు కూడా ఓ కారణం ఉంది.

ఆచార్య సినిమా షూటింగ్‌లో రాంచరణ్ పాల్గొంటుండడం, ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను తారక్ చేస్తుండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

దీనికి తోడు ‘ఆర్ఆర్ఆర్’ వీఎఫెక్స్ వర్క్‌కి చాలా సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ చూసుకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ట్రిపుల్ ఆర్ వచ్చే అవకాశం ఉంది.

 

- Advertisement -