ఏపీలో కొనసాగుతున్న మునిసిపల్ ఎన్నికల పోలింగ్.. భారీగా నమోదవుతున్న ఓటింగ్

- Advertisement -

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలు కాగా, 11 గంటల సమయానికి 32.23 శాతం పోలింగ్ నమోదైంది.

శ్రీకాకుళం జిల్లాలో 24.58, విజయనగరం జిల్లాలో 31.97, విశాఖపట్టణంలో 28.5, తూర్పుగోదావరిలో 36.31, పశ్చిమగోదావరి జిల్లాలో 34.14, కృష్ణా జిల్లాలో 32.64 పోలింగ్ నమోదైంది. 

అలాగే గుంటూరులో 33.62, ప్రకాశంలో 36.12, అనంతపురంలో 31.36, నెల్లూరులో 32.67, చిత్తూరులో 30.21, కడపలో 32.82, కర్నూలులో 34.12 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

మంత్రి ఆళ్ల నానికి షాక్…

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లోని శనివారపుపేటలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చుక్కెదురైంది. ఓటరు జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

చిత్తూరు జిల్లా తిరుపతిలోని 16వ వార్డులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన టీడీపీ నేత జేబీ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనను అరెస్ట్ చేసిన పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారు.

శ్రీనివాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అరెస్ట్ చేసిన శ్రీనివాస్‌ను పోలీసులు విడిచిపెట్టారు.

- Advertisement -