
భువనేశ్వర్: గత రెండు దశాబ్దాలుగా ఒడిశాని పాలిస్తున్న బిజు జనతాదళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్….మరోసారి సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్నారు. ఒడిశాలో ఓటర్లు మళ్ళీ నవీన్‌కే పట్టం కట్టారు. నవీన్ వరుసగా 5వ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు.
దీంతో సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగుతున్న అరుదైన రికార్డును నవీన్ సొంతం చేసుకున్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా అధికార బిజు జనతాదళ్ పార్టీనే ఇక్కడ అధికారంలోకి వస్తుండగా, ఈ సారి కూడా అదే తరహా ఫలితాలు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బిజేడి హవా…
మొత్తం 147 సీట్లకు గానూ బీజేడీ 113 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 19, కాంగ్రెస్ 13 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఇప్పటికే నాలుగుసార్లు పూర్తికాలం సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేయడం లాంఛనంగా మారింది.
అయితే అసెంబ్లీలో బిజేడి కి పట్టం కట్టిన ఓటర్లు…పార్లమెంటు ఎన్నికల్లో విభిన్న తీర్పు ఇచ్చారు. మొత్తం 21 స్థానాల్లో బీజేపీ మొత్తం 8 స్థానాలు ఎంపీ కైవసం చేసుకుంది. అయితే అధికార బీజేడీ సైతం 14 సీట్లను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే గతం కన్నా బీజేపీ ఈ సారి ఒడిశాలో పుంజుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకోగా, ఈ సారి ఏకంగా 8 సీట్లకు ఎగబాకింది.








