
కోల్‌కతా: ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోడీ వేవ్ గట్టిగా ఉండటంతో పశ్చిమ బెంగాల్‌లో సైతం బీజేపీ 42 స్థానాలకి గాను..18 సీట్లలో సూపర్ విక్టరీ కొట్టింది. ఇక సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 22 స్థానాలని గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 2 స్థానాలని కైవసం చేసుకుంది.
అయితే 18 సీట్లు గెలుచుకుని బీజేపీ మమత ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మమతకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నపళాన ఢిల్లీ వెళ్లడం సీఎం మమతను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఆ ముగ్గురిలో ఒకరైన సుభాన్షు రాయ్ పై పార్టీ వ్యతిరేక వైఖరి కారణంగా అధినాయకత్వం ఆరేళ్ల నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో సుభాన్షు రాయ్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ మోడీ, అమిత్ షాల సమక్షంలో వీరు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.
కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ… మాట్లాడుతూ తనతో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మండిపడ్డారు. అయితే, ఆ రోజు మోడీ ఊరికే ఆ మాటలు చెప్పలేదని ఇప్పుడు అర్థమవుతోంది.








