చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు సుసి గణేశన్ తనతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వెల్లడించింది నటి అమలా పాల్. సుసి గణేశన్ తనను వేధించినట్లు ఇటీవల దర్శకురాలు లీనా మనిమెకలై మీడియా ద్వారా బయటపెట్టగా, తాజాగా అమలా పాల్ కూడా స్పందిస్తూ ఈ విషయంలో లీనాకు తాను పూర్తి మద్దతిస్తానని తెలిపింది. సుసి గణేశన్ తన పట్ల కూడా ఇలాగే ప్రవర్తించారని అమలా పాల్ ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
‘‘లీనాకు నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. దర్శకురాలిగా ఎదుగుతున్న లీనా పట్ల సుసి గణేశన్ ఎలా ప్రవర్తించి ఉంటాడో ఊహించగలను. సుసి గణేశన్ దర్శకత్వం వహించిన ‘తిరుటుపాయలే 2’ చిత్రంలో నేను హీరోయిన్‌గా నటించాను. ఆ సమయంలో నాతో ద్వంద్వార్థాలున్న మాటలు అనేవాడు. అతని ప్రవర్తనతో చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ధైర్యంగా ముందుకొచ్చి తాను ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టినందుకు లీనాను అభినందిస్తున్నాను..’’ అని అమలా పాల్ పేర్కొంది.
అంతేకాదు, ‘‘ఈ తరహా సంఘటనలు అన్ని ప్రదేశాల్లోనూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి మనుషులు తమ ఇంట్లోని భార్య, పిల్లలను చాలా జాగ్రత్తగా, మర్యాదగా చూసుకుంటారు. కానీ ఇతర మహిళల పట్ల మాత్రం తమ ప్రతాపాన్ని చూపించాలనుకుంటారు. మున్ముందు మన భావితరాలు ఇలాంటి సంఘటనలను ఎదుర్కోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్టిస్తున్నాను..’’ అని అమలా పాల్ ఆ పోస్ట్‌లో కోరింది.
అయితే అమలా పాల్ ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సుసి గణేశన్, అతని భార్య మంజరి.. ఆమెకు ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడారట. ఆ విషయాన్ని కూడా అమలా పాల్ బయటికి చెప్పేసింది.
‘‘ఇప్పుడే నాకు షాకింగ్ సంఘటన ఎదురైంది. సుసి గణేశన్, అతని భార్య మంజరి నాకు ఫోన్ చేశారు. అసలేం జరిగిందో వివరించాలనే నేను ఫోన్జ లిఫ్ట్ చేశాను. కానీ వారు నా మాట వినకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. మంజరి వెటకారంగా నవ్వుతూ నా వ్యక్తిత్వాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటి వాటితో నన్ను బెదరగొట్టాలనుకుంటున్నారేమో..’’ అని అమలా పాల్ మరొక ట్వీట్ ద్వారా వెల్లడించింది.