

తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. మరోవైపు కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన యూడిఎఫ్ పక్షాలకు బీజేపీ, అన్ని వర్గాల అయ్యప్ప సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రభావానికి కేరళ స్తంభించింది.
అంతేకాదు, ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. మరోవైపు కోయంబత్తూరు- పాలక్కాడు, నాగర్ కోయిల్- త్రివేండ్రం సరిహద్దులు మూసివేయటంతో ఇరువైపుల రవాణా కూడా స్తంభించింది. రెండువైపులా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కేరళ వైపు వెళ్లే బస్సులను కోయంబత్తూరు, నాగర్ కోయిల్‌లొనే నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో బంద్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ఘటనలు ఉత్పన్నమవుతాయో తెలియకుండా ఉంది.
చెన్నైలోని కేరళ హోటల్‌పై దాడి…
శబరిమల ఎఫెక్ట్ చెన్నైలోనూ కనిపిస్తోంది. చెన్నైలోని కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఓ హోటల్‌పై బుధవారం రాత్రి 10.40 ప్రాంతంలో దాడి జరిగింది. థౌజండ్ నైట్‌లోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న ఆ హోటల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో హోటల్ భవనం అద్దాలు, సెక్యురిటీ చెక్‌పోస్టు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కేరళ ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా 100 మంది పోలీసులను నియమించినట్లు ఓ అధికారి తెలిపారు.
నిన్న ఏం జరిగిందంటే…
బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారు. గతంలో కూడా ఒకసారి వీళ్లు ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. అప్పుడు అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకున్నారు.
అయితే మహిళా సంఘాలు కేరళ వ్యాప్తంగా మానవహారం నిర్వహించిన తర్వాత పోలీసులు, ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కొందరు యూనిఫాంలో ఉన్న పోలీసులు, అలాగే మఫ్టీలో ఉన్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున బిందు, కనకదుర్గలను స్వయంగా ఆలయ గర్భ గుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.
దర్శనం అనంతరం పోలీసులు వారిని సురక్షితంగా పథనంతిట్టకు తీసుకొచ్చారు. అక్కడ్నుంచి గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు.
ఆలయం మూసివేత, సంప్రోక్షణ…
ఈ ఘటన తరువాత శబరిమల ఆలయాన్ని పూజారులు మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకుడి ఆదేశాల మేరకు ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో ప్రధాన అర్చకుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంప్రోక్షణ అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచారు.
ఈ ఘటనకు సంబంధించి పలు టీవీ ఛానెళ్లలో దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఆ తరవాత కొద్దిసేపటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. గతంలో కొన్ని అడ్డంకుల కారణంగా మహిళలు ఆలయానికి వెళ్లలేకపోయే వారని, బుధవారం ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవడంతో గుడిలోకి ప్రవేశించగలిగారని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనతో శబరిమలలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తోన్న హిందూ సంస్థలు ఆందోళనలకు దిగాయి. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో రాష్ట్ర సచివాలయం వద్ద భాజపా కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.
అధికార పార్టీ సీపీఎం, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని, ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో రాష్ట్ర సచివాలయం పరిసరాలు దాదాపు ఐదు గంటలపాటు యుద్ధక్షేత్రాన్ని తలపింపచేశాయి. కేవలం తిరువనంతపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రాళ్ల దాడులు జరిగాయి.
పండలంలో జరిగిన రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి(55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశాడు. మరోవైపు హిందూ సంస్థలతో ఏర్పడిన శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్తు (ఏహెచ్‌పీ) గురువారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.
పలు యూనివర్సిటీల్లో పరీక్షలు వాయిదా…
గురువారం బంద్ నేపథ్యంలో కేరళ, మహాత్మాగాంధీ, కాలికట్, కన్నూర్ సహా పలు యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు రాళ్ల దాడుల్లో సుమారు 60కిపైగా బస్సులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆర్టీసీ తమ బస్సులను గురువారం నిలిపివేసింది.
బంద్ కారణంగా కేరళలోని అన్ని చోట్ల దుకాణాలను పోలీసులు మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో అని పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








