మెట్రో ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం: రోగుల తరలింపు, రంగంలోకి 12 ఫైరింజన్లు

metrohospital

న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నోయిడా సెక్టార్‌ 12లోని మెట్రో ఆస్పత్రిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్న 12 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటలు ఎక్కువగా ఉండటంతో కాపాడాలంటూ రోగులు కేకలు వేశారు. కాగా, ఆస్పత్రి లోపల చిక్కుకున్న వందలాది మంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, అధికారులు యత్నిస్తున్నారు.

కిటికీలను పగులగొట్టి రోగులను బయటకు తీసుకువస్తున్నారు. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.