ప్రధానిపై ఇలాంటి పోస్టులా?: కాంగ్రెస్‌పై మాధవన్ ఆగ్రహం…

4:08 pm, Sat, 16 March 19
Madhavan calls out Congress for mocking PM Narendra Modi, gets schooled in politics, Newsxpressonline

న్యూఢిల్లీ: చైనా వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రముఖ సినీనటుడు ఆర్ మాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇద్దరూ కలిసి ఉన్న మీమ్‌ వీడియోను కాంగ్రెస్‌ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది.

కాంగ్రెస్ నుంచి ఇలాంటి పోస్టులా…

కాగా, ఈ వీడియోపై మాధవన్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి విభేదాలున్నప్పటికీ నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధాని. మీరు చైనా ముందు భారత్‌ను కించపరుస్తున్నారు. ఈ వీడియోలో అలాగే చేశారు. కాంగ్రెస్‌ ట్విటర్‌ ఖాతా నుంచి ఇలాంటి పోస్టులు ఊహించలేదు’ అని ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలోమాధవన్‌ ట్వీట్‌ కూడా వైరల్‌ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మాధవన్ ట్వీట్‌కు మద్దతుగా భారీ సంఖ్యలో నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రధాని మోడీ బలహీనమైన వ్యక్తి అని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను చూసి ఆయన భయపడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ఆ తర్వాత రోజే కాంగ్రెస్‌ ఈ వీడియోను సైతం పోస్ట్‌ చేసింది. రాహుల్‌ విమర్శలకు బీజేపీ కూడా ధీటుగానే బదులిచ్చింది. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా మసూద్‌ అంశంపై కాంగ్రెస్‌ నేతలకు పరోక్షంగా చురకలంటించారు.

కాంగ్రెస్‌ హయాంలో మసూద్‌ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు భారత్‌ ఒంటరిగా ఉందని, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు మనకు మద్దతిస్తున్నాయని అన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ వీడియోపై స్పందించింది.

భారత్‌ను ఇబ్బంది పెట్టేలా చైనా ప్రవర్తిస్తుంటే విచారం వ్యక్తం చేయాలి గానీ ఇలా అపహాస్యం చేయడం ఏంటని ట్విటర్ ద్వారా నిలదీసింది. చైనాకు ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారం రావడానికి జవహర్ లాల్ నెహ్రూనే కారణమని గుర్తు చేసింది. అప్పుడు భద్రతా మండలిలో సభ్యత్వం వచ్చే అవకాశాలు భారత్‌కు ఉన్నప్పటికీ నెహ్రూ మాత్రం చైనాకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడింది.