
ఢిల్లీ: ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతుండగా…తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులకు సంబంధించి బిజీగా ఉండడంతో కేసీఆర్ సమావేశానికి దూరంగా కానున్నారు.
అయితే నీతి ఆయోగ్ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ కూడా హాజరు కావడం లేదు. ఈ మేరకు మమత మోడీకి ఓ లేఖ రాశారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే నీతి ఆయోగ్ ఎజెండానే రూపొందించారని, ఈ సమావేశానికి హాజరు కావడం నిరర్ధకమని మమత పేర్కొన్నారు.
ఇక నీతి ఆయోగ్ కంటే ప్రణాళిక సంఘమే మెరుగైనదని, దానిని తిరిగి తీసుకురావాలని, సమావేశాలకు ముందు ప్రణాళిక సంఘం రాష్ట్రాలను సంప్రదించేదని, సమస్యలు పరిష్కరించేదని అన్నారు. ప్రణాళిక సంఘాన్ని తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు మమత తెలిపారు.








