
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ బలగాలు తనిఖీలు చేసింది.
అలాగే ఎయిర్‌పోర్ట్ లాంజ్ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్సులోనే చంద్రబాబు ప్రయాణం చేశారు. ఇక చంద్రబాబును అలా తనిఖీ చేయడంపై సాధారణ ప్రయాణికులు కూడా అవాక్కయ్యారు.
వీఐపీ, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా కూడా ప్రత్యేక వాహనం కేటాయించకుండా అధికారులు చంద్రబాబుతో దారుణంగా ప్రవర్తించారు. ఇఫ్పటికే జగన్ ప్రభుత్వం చంద్రబాబు కాన్వాయ్‌లో రెండు వాహనాల్ని తీసేసిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో వాదోపవాదాలు నడుస్తున్నాయి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనను కూడా తనిఖీ చేశారని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి జరిగినప్పుడు జగన్ కు భద్రతను ఎందుకు కల్పించలేదని అన్నారు. ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట అంటూ ఎద్దేవా చేశారు.
ఇక బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెలుసు చంద్రబాబుగారూ అని అన్నారు. గతంలో తమరి కులపెద్ద స్పీకర్ అయినప్పుడు మీరు ఆయనను తీసుకుని వెళ్లారు… అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్ మీతో పాటు నడిచి స్పీకర్ ను అభినందించారని చెప్పారు.








