
బెంగళూరు: మరణం ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ ముహూర్తం ఫిక్స్ చేస్తుందో తెలియదు. ఓ మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ అనుకోకుండా అందులోనే ప్రాణాలు వదిలారు.
ఆయన కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఉడుపి మాజీ ఎమ్మెల్యే. అత్యంత సాధారణ జీవితం గడిపే ఆయన శుక్రవారం బస్సులో బెంగుళూరు నుంచి మంగుళూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
బస్సులో ప్రయాణిస్తూ…
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత గోపాల్ భండారి(66) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతి చెందడం ఆయన కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1999, 2008 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో భండారీ ఉడిపి నియోజకవర్గం నుంచి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బస్సు మంగుళూరు చేరుకున్నప్పటికీ ఎంతకీ భండారీ లేవకపోవడంతో డ్రైవర్ దగ్గరికెళ్లి గమనించాడు. అప్పటికే భండారీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే భండారీ మృతి చెందినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు.








