దేవుడా.. పెట్రోల్, డీజిల్ ధరలపై బడ్జెట్ బాదుడు.. ఇప్పుడు లీటర్ ఎంతో తెలుసా?

8:28 pm, Fri, 5 July 19
petrol-diesel-prices-hike

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను తొలిసారిగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2019లో చివర్లో షాక్ ఇచ్చారు. బంగారంపై ఎక్సైజ్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించిన ఆమె.. పెట్రోలియం, డీజిల్‌పై కూడా ఎక్సైజ్ సుంకం, సెస్‌లను పెంచుతున్నట్టు ప్రకటించారు. 

చదవండి: కేంద్ర బడ్జెట్ 2019: ధరలు పెరిగేవి ఏవి? తగ్గేవి ఏవి?

కేంద్ర పన్నులు పెంచడంతో.. ఆటోమెటిగ్గా లోకల్ ట్యాక్స్‌లు కూడా పెరుగుతాయి. కాబట్టి పెట్రోల్‌ ధర రూ.2.50 పైసలు, డీజిల్ ధర రూ.2.30 పైసలు పెరగనుంది. ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూపంలో రూ.2 మేర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడంతో.. కేంద్ర ఖజానాకు రూ.28 వేల కోట్లు చేరనున్నాయి.

క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనా…

అంతేకాదు, క్రూడ్ ఆయిల్ దిగుమతులపై కూడా మోడీ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని విధించనుంది. ఇప్పటివరకు టన్ను క్రూడ్ ఆయిల్‌కు 50 పైసల చొప్పున విపత్తు పన్ను వసూలు చేస్తున్నారు. ఇకమీదట ఈ పన్ను ఒక్క రూపాయికి పెరగనుంది.

ఆఫ్ట్రాల్ 50 పైసలే కదా పెరిగింది అనుకుంటున్నారేమో! రోజుకు 220 మిలియ్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ లెక్కన ప్రభుత్వానికి రోజుకు రూ.22 కోట్లు లాభం రానుంది.

లీటర్ పెట్రోల్‌పై ఇప్పటి వరకూ రూ.17.98 పైసలు ఎక్సైజ్ డ్యూటీ చెల్లిస్తున్నాం. ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.2.98 పైసలు.. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీగా రూ.7, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూపంలో 8 రూపాయలు వసూలు చేస్తున్నారు.

అలాగే లీటర్ డీజిల్‌పై రూ.13.83 పైసలు ఎక్సైజ్ డ్యూటీ చెల్లిస్తున్నాం. ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.4.83 పైసలు.. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీగా రూ.1, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ 8 రూపాయలుగా ఉంది.

వ్యాట్, డీలర్ల కమీషన్ ఇలా…

ఇక వ్యాట్ రూపంలో రాష్ట్రాల బాదుడు సరే సరి. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌పై 35.77 శాతం, లీటర్ డీజిల్‌పై 28.08 శాతం వ్యాట్ విధిస్తున్నారు. తెలంగాణలో 33.31 శాతం, 26.01 శాతం చొప్పున పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ వసూలు చేస్తున్నారు.

డీలర్ కమీషన్ లీటర్ పెట్రోల్‌కు రూ.3 నుంచి రూ.3.65 పైసలు ఉంటుండగా.. డీజిల్‌పై రూ.2 నుంచి రూ.2.65 పైసలు ఉంటోంది. ఎక్సైజ్ సుంకాలు, వ్యాట్, డీలర్ కమీషన్ కలగలిపి.. వాహనదారులు అసలు ధర కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది.