ఇక రాజకీయాలు వద్దు: కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి సంచలన నిర్ణయం!

karnataka-cm-kumara-swamy
- Advertisement -

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.  తాను ప్రశాంతత కోరుకుంటున్నానని, ఇకమీదట తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

ఇటీవల జరిగిన బలనిరూపణ పరీక్షలో కుమార స్వామి ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం కుమార స్వామి తాజా వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి పని చేసినప్పటికీ ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

‘‘సీఎం పదవి నాకో లెక్క కాదు.. కానీ’’

కాంగ్రెస్ పార్టీ తీరుపైనా, ఎమ్మెల్యేలపైనా ఇప్పటికే పలుమార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కుమారస్వామి తనకు ముఖ్యమంత్రి పదవి ఒక లెక్క కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు పట్ల ఆయన కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. 

అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, అనుకోకుండానే సీఎంను అయ్యానని కుమార స్వామి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడని దానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఎవరినో సంతృప్తిపరిచేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. 

ప్రజలకు మంచే చేశా…

ముఖ్యమంత్రిగా తాను పని చేసినంత కాలం ప్రజలకు మంచే చేశానని కుమారస్వామి చెప్పుకొచ్చారు. తాను చేసిన పనులకు ప్రజల గుండెల్లో తనకూ కొంత చోటు ఉందని అనుకుంటున్నట్లు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సీఎంగా పనిచేసిన 14 నెలలు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేసినట్లు తెలిపారు. తన 14 నెలల పాలనపై సంతృప్తి చెందుతున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై ఆయన ఆసక్తికర వ్యాక్యలు చేశారు.

రాజకీయాలు కుల సమీకరణాలతో కూడుకున్నవని ఇటీవలే తెలిసిందన్నారు. ఆ కులాల రొంపిలోకి తన కుటుంబాన్ని లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయో తాను గమనిస్తూ వస్తున్నానని, అసలు రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలను మరింత వేడెక్కించాయి. 

- Advertisement -